ఖుర్‍ఆన్ దహన దినం

రచయిత సహో. ప్రభుతేజ

కొద్ది దినముల క్రితం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చేందిన టెర్రీ జోన్స్ అనే పాస్టరుగారు తన సంఘముతో కలిసి ముస్లిముల మతగ్రంథమైన ఖుర్‍ఆన్‍ను సామూహికంగా దహించాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు అమెరికా దేశములోనేకాక మొత్తం ప్రపంచంలోని ముస్లిముల దృష్టిని ఆకర్షించడం మరియు దానికి వారు నిరసనలు జరపటం మనకందరికీ తెలిసిన విషయమే. ఆయన తలపెట్టిన  ఈ పనిని విమర్శిస్తూ చాలా దేశాలనుండి చాలామంది తమ తమ ఉద్దేశ్యాన్ని బయలుపరిచినట్టు టీవీలా ద్వారా మరియు ఇంటర్నెట్ ద్వారా మనం తెలుసుకొనవచ్చు. పాస్టర్ టెర్రీ జోన్స్‌గారి ఉద్దేశ్యం ఏమైనప్పటికీ ఆయన తలపెట్టిన పని క్రైస్తవ దృక్పథంలో అంగీకారయోగ్యమా కాదా అనేది పక్కన పెడితే ముస్లిముల సాహిత్య పుస్తకాల ప్రకారం ఇంతకముందే ఖుర్‍ఆన్ ముస్లింల చేతిలోనే దహించబడినదని మనము గమనించవచ్చు. ముస్లిముల నాయకులు ఖుర్‍ఆన్‍ను ఆనాడు ఎందుకు దహనం చేశారో మనం గ్రహించగలిగితే ఈనాడు పాస్టరుగారు దహనం చేయాలనుకున్న ఖుర్‌ఆన్ పుస్తకం అసలు నిజమైన మొదటి ఖుర్‍ఆనేనా, ఈ మాత్రానికే ఇంత రాద్ధాంతం చేయాలా అనే ప్రశ్నలు పాఠకులలో తప్పక పుడతాయి. ఏదో ఎవరికీ తెలియని ఒక రహస్యం నేను వ్రాస్తున్నాను అనుకోకండి, ఇది ఒక యథార్థం. ఈ యదార్థం నేనో లేక ఇంకెవరో కనుగొన్న సిద్ధాంతం కాదు, సాక్ష్యాత్తు ముస్లిముల సాహిత్యములైన హదీసు పుస్తకాలలో వ్రాయబడి నిక్షిప్తంచేయబడిన చారిత్రాత్మక ఘటనలు.

ముహమ్మద్ మరణానంతరం అబూ బక్ర్ర్ అనే ముహమ్మద్ యొక్క అనుచరుడు ముస్లిములకు ముఖ్య నాయకుడుగా (ఖలీఫా) ఎంచుకోబడ్డాడు. అతని సన్నిహితుడైన ఉమర్, “యమామ” యుద్ధములో చనిపోయిన చాలామంది "కుర్రా"ల (కుర్రా అనగా ఖుర్‍ఆన్‍ను కంఠస్థం చేసినవారు) విషయమై మాట్లాడుతూ, ఖుర్‍ఆన్‍ను క్రోడీకరించవలసిందిగా అబూ బక్ర్‌కు విన్నవించుకొన్నాడు. అప్పటి వరకు లిఖిత పూర్వకమైన ఖుర్‍ఆన్ మనుగడలో లేదు కనుక, ముహమ్మద్ వల్లించిన ఆయతులను అతని అనుచరులు సైతం వల్లించి, దానినే ఖుర్‍ఆన్‍గా ప్రసిద్ధి చేసెడివారు. “యమామ” అనే యుద్ధములో చాలామంది అలా వల్లించేవారు (కుర్రా లేక కారీలు) చనిపోయిన కారణంగా అప్పటి ముస్లిముల నాయకుడైన అబూ బక్ర్‌పై ఖుర్‍ఆన్‌ను క్రోడీకరించే బాధ్యత పడింది. అందుకు అబూ బక్ర్ నాయకత్వంలో ముహమ్మద్‌కు కార్యదర్శిగా ఉండిన జైద్ బిన్ తాబిత్, అప్పటివరకు చర్మముపైన, పలకలపైన మరియు ఎముకలపైన వ్రాయించి పొందుపరచబడిన ఖుర్‍ఆన్‌ను ఒక పుస్తకముగా వ్రాయటం జరిగింది ( సహీహ్ అల్ బుఖారీ భాగం 6, గ్రంథము 60, సంఖ్య 201). అయితే జైద్ బిన్ తాబిత్ ఖుర్‍ఆన్‌ను పొందుపరిచే సమయానికే ఖుర్‍ఆన్‌లోని చాలా భాగం నశించింది అన్న విషయం ముస్లిం సాహిత్యంలో వివరించబడినది. జాన్ బర్టన్, కలెక్షన్ ఆఫ్ ఖుర్‍ఆన్ 126 -127 పేజీల ప్రకారము చనిపోయిన కుర్రాలతో పాటే ఖుర్‍ఆన్‌లోని  చాలా భాగం నశించిందని, ఆ ఖుర్‍ఆన్ యొక్క ఆయతులు ఇప్పటి ఖుర్‍ఆన్‌లో పొందుపరచబడలేదని గ్రహించగలము. ఇలా వ్రాయబడ్డ ఖుర్‌ఆన్ ప్రతిని అబూబక్ర్ తన వద్దనే ఉంచుకున్నాడు కాని దానిని ఒక ప్రామాణిక ఖుర్‍ఆన్‌గా ప్రకటించలేదు. ఎందుకంటే, జైద్ బిన్ తాబిత్‌ కంటే పెద్దవారు, అనుభవజ్నులు, పండితులునైన ఉబయ్ బిన్ కాబ్ మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ మసూద్ వంటి వారేకాక ఇంకా అనేకమంది కూడా వారికి తోచినట్టు ఖుర్‍ఆన్‌ను కూర్చి వ్రాశారు. ఇందు కారణముగా ఆనాటి ముస్లిం సమాజములో అప్పటికే వాడుకలో ఉండిన అనేక ఖుర్‍ఆన్‌లలో అసంఖ్యాకమైన వ్యత్యాసాలు ఉండేవి. ఎవరికి ఏ ఖుర్‍ఆన్ నచ్చితే ఆ ఖుర్‍ఆన్‌ను సరైనదని నమ్మి వాడటం జరిగేది. అందుమూలముగా ఆయా ముస్లిం సమూహముల మధ్య విబేధాలు రావడం జరిగినది. ఐతే అబూబక్ర్ మరణానంతరం జైద్ బిన్ తాబిత్‌ వ్రాసిన ఆ ఖుర్‌ఆన్ యొక్క ప్రతి ముహమ్మద్ భార్యలలో ఒకతైన హఫ్సా వద్దనే ఉండిపోయినది.

ఆ తర్వాత మూడవ ఖలీఫాయైన ఉత్మాన్, ఖుర్‍ఆన్‌ విషయములో ఏర్పడ్డ విబేధాలను పరిష్కరించాలన్న నెపంతో ముహమ్మద్ యొక్క అనేక భార్యలలో ఒకతైన హఫ్సా వద్ద ఉండిన జైద్ బిన్ తాబిత్ వ్రాసిన ఖుర్‍ఆన్‌ ప్రతిని తెప్పించి దానినే అనేక ప్రతులుగా వ్రాయించాడు. అయితే అలా వ్రాస్తున్న సమయంలో వ్రాసెడివారు ఏకీభవించని ఆయతు ఏదైనా తటస్తిస్తే దానిని వారికి సరనిపించినట్టు ఖురైష్ యాసలో వ్రాయవలసిందిగా ఆజ్ఞాపించాడు. అలా వ్రాయించిన ఖుర్‍ఆన్‌ ప్రతులను అప్పటి ముఖ్య ముస్లిం కేంద్రాలకు (మదీన, కూఫా, బస్రా, దమస్కు) పంపించి వాటిని అధికారిక ఖుర్‍ఆన్‌గా ప్రకటించాడు. అంతేకాక, అధికారికం కాని మిగతా ఖుర్‍ఆన్ ప్రతులన్నింటిని సేకరించి వాటిని తగులబెట్టించాడు. (ఫత్ అల్ బారి భాగం 9, పేజి 18). అలా మొదటిసారి ఉత్మాన్ హయాములో ఖుర్‍ఆన్ ప్రతులన్నీ ముస్లిముల చేతులలోనే తగులపెట్టబడ్డాయి. ఇక ఇది చాలదని జైద్‌చే సేకరించబడి కూర్చబడిన ఖుర్‍ఆన్‌ను మదీన ప్రాంత గవర్నర్‌గా ఉండిన మర్వాన్ అనేక మార్పులకు గురిచేశాడు. కితాబ్ అల్ మసాహిఫ్‍లో సలీం మాటలాడిన ఈ మాటలను ఇబ్న్ అబు దావూద్ రచించెను:

హఫ్సా మరణానంతరం మేము ఆమె అంత్యక్రియల నుండి వచ్చుచుండగా మర్వాన్, హఫ్సా తమ్ముడైన అబ్దుల్లాహ్ బిన్ ఒమర్ వద్దకు ఆమె (హఫ్సా) వద్ద ఉండిన ఖుర్‍ఆన్‌ను తీసుకురమ్మని పంపెను. అబ్దుల్లాహ్ బిన్ ఒమర్ ఆ ప్రతులను పంపగా మర్వాన్ వాటిని చింపివేసెను. అప్పుడు అతను ఈ పుస్తకములో వ్రాసిన ప్రతి విషయము అధికారికమైన ఖుర్‍ఆన్‌లో కూడా వ్రాసి ఉంది, అంతేకాక కొన్నిదినముల తరువాత ప్రజలు ఈ ప్రతిలో వ్రాయబడని సంగాతులున్నాయేమో అని అనుమానించుదురు అని చెప్పెను.”

ఇలా అబూ బక్ర్ (ముహమ్మద్ యొక్క స్నేహితుడు మరియు మామ) యొక్క అధికారములో వ్రాయబడిన ఖుర్‍ఆన్‌ను మర్వాన్ నాశనము చేయించెను. ఇది ఖుర్‍ఆన్‌ యొక్క రెండవ దహన సందర్భం.

ఈ విధంగా ఖుర్‍ఆన్‌ను దాని అసలు రూపములో ఉంచకుండా, తమకిష్టం వచ్చినట్టు వ్రాసుకొని, బేరీజు వేసి పోల్చి చూసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా దాని మూల ప్రతులను సైతమూ దహనం చేయించిన ముస్లిం నాయకులు గొప్పవారు ఎలా అవుతారు? అలాంటప్పుడు, పాస్టర్ టెర్రీ జోన్స్‌గారు ఖుర్‍ఆన్‌ను తగులబెట్టినంత మాత్రాన ఇస్లాం మతానికి కొత్తగా కలిగే నష్టంగాని అప్రతిష్టగాని ఏముంది? కాని ముస్లిం నాయకులు మతం ముసుగులో స్వయముగా తమ సొంత ఖుర్‍ఆన్‌ మూల ప్రతులనన్నింటిని తగులబెట్టటం మాత్రం ఇస్లాం మతానికి తీరని నష్టం మరియు అప్రతిష్టే కదా! పాస్టరు గారు చివరికి ఖుర్‍ఆన్‌ను బహిరంగంగా తగులబెట్టటం నిలిపివేశారు. అయితే ముస్లిములు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, పాస్టర్ టెర్రీ జోన్స్ తగులబెట్టాలనుకున్న గ్రంథం నిజంగా ఖుర్‍ఆనేనా? ఆ పుస్తకం అసలైన ఖుర్‍ఆన్‌ అని అనడానికి వారి వద్ద ఏమైనా ప్రమాణం ఉందా? పైన చెప్పబడిన విధముగా ముస్లిం సాహిత్యాలు నొక్కి వక్కాణిస్తున్న సత్యాల మాటేమిటి?

ఇదంతా ఎంత విచిత్రం? మీ బైబిల్ మారిపోయిందని క్రైస్తవుల మీద ముస్లిములు ఈనాడు ధ్వజమెత్తుతున్నారే! నిజానికి వారి పుస్తకమే సవరణకు కూడా అందనంతగా మారిపోయిందని, చెడిపోయిందని, అందుకనే కొత్తగా వారు ఒక పడుచువాడి (జైద్) చేత వ్రాయించుకున్న ఖుర్‌ఆన్ తప్ప మిగతా వేలాది లక్షలాది “అసలు ఖుర్‌ఆన్” ప్రతులనన్నింటినీ ఎప్పుడో కాల్చేశారని తెలిస్తే, పాపం తమ వాదన తప్పని, మారిపోయింది మరియు చెడిపోయింది తమ పుస్తకమేనని, అందుకే అది ముస్లిముల చేతిలోనే ఎప్పుడో దహించబడిందని ఒప్పుకోక తప్పదు. విచారం గొలిపే మరొక ఆశ్చర్యకర విషయమేమనగా ప్రపంచములోని మరే మత విశ్వాసులు కూడా తమ మత గ్రంథాలను ఎన్నడూ కాల్చుకోలేదు. ఈ నీఛ క్రియ కేవలం ముస్లిముల సొంతం. పాపం! గురిగింజ తనకున్న నలుపునెరుగక తన రంగు గురించి మిడిసి పడిందన్నట్టుందిది! ఈ నిజం తెలిసికొన్న ఏ యథార్థవంతుడైనా సరే వెంటనే ఇస్లామును పరిత్యజించి బైబిల్‌నే విశ్వసిస్తాడు. మరి నీవు యథార్థవంతుడివేనా?


ప్రభుతేజ (తెలుగు రచయిత)
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు