దైవ ప్రేమ
"దేవుడు లోకమును ఏంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).
మానవుని యెడల దేవుని ప్రేమను ప్రకటించు ఈ ముఖ్యమైన దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలుపుచున్నది. బైబిలు దేవుని పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథమును చదువు ప్రతివాడు దేవుడున్నాడని ఎరుగును. "ధేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు" (కీర్తనలు 14:1).
దేవుడు పరిశుద్ధుడును, నీతిమంతుడని బైబిలు చెప్పుచున్నది. ఆయన సృష్టికర్త. ఆయనకు అవిధేయులైన వారికి తీర్పు జరుగును. ఆయనకు విరొధముగా పాపము చేయువానిని దేవుడు శిక్షించును. "దేవునికి పక్షపాతము లేదు"(రోమా 2:11). ఆయన లోకములోని వారందరిని ఒకేరీతిగా ప్రేమించును. మన ద్రవ్యమునుబట్టి, మన హోదా మరియు స్థానములనుబట్టి ఆయన మనలను చూడడు. మానవుని రంగు, భాష, జాతి, మతము, కులమునుబట్టి ఆయన తీర్పు తీర్చడు. "దేవుడు ప్రేమాస్వరూపి" (1 యోహాను 4:8). నీ తల్లి నిన్ను ప్రేమించును గదా? తప్పక ప్రేమించును, అయితే దేవుని ప్రేమ తల్లి ప్రేమకంటె ఎంతో లోతైనది, గొప్పది, బలమైనది. దేవుని వాక్యము చెప్పునదేమనగా, "స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను" (యెషయా 49:15). దేవుడు తన ప్రేమను చూపుటకును, తనతో సహవాసము కలిగియుండుటకును మానవుని సృష్టించెను. ఆయన ఈలాగు సెలవిచ్చుచున్నాడు. "నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనై యుందును; మీరు నాకు ప్రజలై యుందురు"(లేవి. కాం. 26:12).
దేవుడు మానవుని సృష్టించినప్పుడు శరీరము మాత్రమేగాక, ప్రాణము, ఆత్మను కూడా యిచ్చెను. ఒక వ్యక్తి అనగా కండ్లు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్లు కావు గాని అంతకన్న ముఖ్యమైనది అతనిలో నున్న ప్రాణము, ఆత్మ.
నిజమైన వ్యక్తిత్వము నీ ప్రాణమే. నీ ప్రాణములో (ఆత్మకు) భయంకరమైన రోగమున్నది. దీనిని ఈ లోక సంబంధమైన వైద్యులు ఎవరూ బాగు చేయలేరు. ఈ రోగమే పోట్లాటలు, యుద్ధములు, మోసము, అబద్దములు దొంగతనములకు కారణము. అది మరణమును తీసికొని వచ్చును. అది ఏ రోగమో నీకు తెలియునా? దానినే బైబిలు ’పాపము’ అనుచున్నది. పాపమనగా దేవునికి విరోధముగా నుండి ఎదిరించుట, స్వార్థము నాయిష్టానుసారమైన మార్గములో జీవించెదననుటయే. "మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవకు తొలిగెను" (యెషయా 53:6). పాపపు శిక్ష మరణము. "పాపము వలన వచ్చు జీతము మరణము"(రోమా 6:23). "ఏ బేధమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నరు"(రోమా 3:23). కనుక లోకములో అందరమును నేరస్థులమే. తలంపులు, మాటలు, క్రియలవలన పాపము చేయుచున్నాము. "పాపములోనే జన్మించితిని. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను" (కీర్తనలు 51:5 ). కనుక జన్మముతోనే మనము పాప స్వభావమును కలిగియున్నాము. పాపముచేత ఆత్మలో చచ్చినవారమైతిమి. కాని "పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను" (1 తిమోతి 1:15).
దేవుడు లోకములో నున్న నిన్ను ప్రేమించుచున్నాడు. కనుక నీ పాప క్షమాపణ కొరకు గొప్ప ఏర్పాటు చేసియున్నాడు. దేవుడు పాపమును ద్వేషించును, కాని పాపిని ప్రేమించును. ఆయన నిన్ను ఎంతో ప్రేమించుచున్నాడు. కనుకనే ఈ లోకమునకు మానవాకారముగా వచ్చెను. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను. వాక్యము దేవుడైయుండెను..... ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను" (యోహాను 1:1,14). "దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింక పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను"(రోమా 5:8). నీ పాపములో నీవు నశింపకుండ నీ పాపములు క్షమింపబడవలెనని కోరుచున్నావా? నీవు నిత్యజీవము పొంది ఈ లోకమును విడిచినప్పుడు పరలోకమునకు వెళ్ళగోరుచున్నావా? అలాగైన మొట్టమొదట నీవు నీ పాపములకై పశ్చాత్తాపపడి నీ హృదయములో నుండి - "దేవా, పాపినైన నన్ను కరుణించుము" అని (లూకా 18:13 లో వ్రాసినట్లు) ప్రార్థించుము. "మారుమనస్సు పొందని యెడల.... నశింతురు"(లూకా 13:3). ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయము దగ్గర నిలుచుండి "ఇదిగో నేను, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చెదను" (ప్రకటన 3:20) అని చెప్పుచున్నారు. మరియు యేసు ప్రభువు ఇట్లు చెప్పుచున్నారు. "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను"(యోహాను 1:12).
దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకై ఈ లోకమునకు పంపిన ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపములకై సిలువలో చనిపోయి, పాతిపెట్టబడి, తిరిగిలేచెనని, నీవు విశ్వసించి, ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించిన యెడల నీవు నశింపక నిత్యజీవము పొందెదవు (యోహాను 3:16). అనగా నీ ఆత్మ వెలిగింపబడి నిత్యత్వమునకు బ్రతికింపబడును. ప్రభువు నీకు ఆ కృపను (హిదాయత్‍ను ) అనుగ్రహించునుగాక.